హిందూపురం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేయడం ఏంటని అనుకుంటున్నారా. అవును వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణసినీ గ్లామర్‌తో గెలుస్తున్నారని.. ఈసారి జగన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
గత 40 ఏళ్లగా హిందూపురం టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటూ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఐదేళ్లకు ఒకసారి వచ్చి టీడీపీ గెలుస్తోంది అన్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. బాలయ్య హిందూపురంకు ఏడాదికి ఒకసారి వచ్చి షో చేస్తున్నారని.. అసెంబ్లీలో హిందూపురం ప్రస్తావనే లేదన్నారు. హిందూపురంకు జిల్లా కూడా రాలేదని.. 40 ఏళ్లగా టీడీపీ ఏమీ చేయలేదన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈసారి జగన్ హిందూపురం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్ప.. తమకు ఎలాంటి పదవి వద్దు అన్నారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి.. ఇక్కడ ప్రజలు ఏం అనుకుంటున్నారో చెబితే చాలన్నారు. గతంలోనే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉంటే టీడీపీకి కంచుకోట ఎందుకు అవుతుందన్నారు. హిందూపురం నుంచి జగన్ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా గెలిపించుకునేందుకు సిద్దమన్నారు. ఎవరినో ఇంఛార్జ్‌గా పంపిస్తారు.. వారి కోసం పనిచేయడం కాదన్నారు. దీపికను కొత్త సమన్వయకర్త పదవిని ఇచ్చారు.. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పలేదు అని గుర్తు చేశారు.
అటు వైఎస్సార్‌సీపీ కూడా హిందూపురంలో వ్యూహం మార్చింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ స్థానంలో దీపికను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈసారి ఎలాగైనా హిందూపురంలో గెలవాలని భావిస్తున్న అధిష్టానం.. దీపిక ఎంపిక వెనుక పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలతో ఆమెను ఎంపిక చేశారనే టాక్ నడుస్తోంది. హిందూపురం వైఎస్సార్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి భార్య దీపిక. ఆమెది కురుబ సామాజికవర్గం.. భర్త రెడ్డి సామాజిక వర్గం.. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు ఆమెను సమన్వయకర్తగా నియమించడంతో.. ఈ రెండు కులాలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌తో దీపికను నియమించారని చెబుతున్నారు.
కొత్త సమన్వయకర్తను నియమించి వారం కూడా కాకముందే.. సొంత పార్టీ నేతలు ఇలా అధినేత జగన్ పోటీ చేయాలంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. దీపిక నియామకం తర్వాత వీరు ఈ డిమాండ్‌ను తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. మరి దీపిక నియోజకవర్గంలో గ్రూప్ వార్‌కు చెక్ పెట్టి అందరిని సమన్వయం చేసుకుని ముందుకు సాగడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.