చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసు అధికారి, ఎస్పీజీ కమాండెంట్‌గా పనిచేసిన పీసీ స్వామి తెలుగుదేశం పార్టీలో చేరారు. అధినేత నారా చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పీసీ స్వామితో పాటు విశ్రాంత రోడ్లు భవనాలు ఇంజనీర్ జీవి కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీ లో చేరారు.
చంద్రబాబు విజన్, ఆయన పాలనను అభిమానించే టీడీపీలో చేరానన్నారు. టీడీపీ విధానాలు.. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చాయన్నారు. చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీకి సేవలందిస్తారని తెలియజేశారు స్వామి. మాదిగలకు రాజకీయాల్లో సముచిత స్థానం లేదని.. ఆ కులానికి చెందిన తనను చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి ఏదో ఒక అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చిన్నస్వామి కోరినట్లు తెలుస్తోంది.
స్వామిది జీడీనెల్లూరు మండలం గోవిందరెడ్డిపల్లె కాగా.. ఎస్పీజీ విభాగం లో కమాండెంట్‌గా స్వామి 8 మంది ప్రధాన మంత్రుల రక్షణ బాధ్యతల్లో కీలకపాత్ర పోషించారు. 33 ఏళ్ల సర్వీస్ తర్వాత స్వామి పదవీ విరమణ చేశారు. స్వామి రాష్ట్రపతి నుంచి రెండు పోలీస్ పతకాలు పొందారు. 77 కేంద్ర, రాష్ట్ర అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
మరోవైపు ప్రొద్దుటూరు నియోజకవర్గ నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరికలు జరిగాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో 1000 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. జగన్ పాలనలో ప్రజలు నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నారన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు.. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశారని మండిపడ్డారు. మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటన్నారు.
జగన్ పాలనలో ప్రజలపై బాదుడు. 4 ఏళ్లలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచి రూ. 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం మోపారని విమర్శించారు.. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. పరిశ్రమలు.. పెట్టుబడులు తెస్తామన్నారు. యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అన్నదాత పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామన్నారు.. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం.. మంచినీటి సౌకర్యం కల్పిస్తాం.. బీసీల కోసం రక్షణ చట్టం తెస్తామన్నారు. ప్రతి ఆడబిడ్డ కు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని.. జగన్ పాలనలో అమర్ రాజా, లులు వంటి కంపెనీలు వెళ్లిపోయాయి.. పెట్టుబడులు తరలిపోయాయన్నారు. ఆడబిడ్డలకి రాష్ట్రంలో రక్షణ లేదని.. తాడిపత్రిలో సిఐ ఆనందరావు ఎమ్మెల్యే ఆరాచకం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయారన్నారు. రాష్ట్రంలో సీఎం గ్రాఫ్ వేగంగా పడిపోతుందని.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమన్నారు. ముందస్తు ఎన్నికలంటూ వాళ్లే లీకులిస్తారు.. వాళ్లే ఖండిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దం. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. జగన్ అంత త్వరగా ఇంటికి వెళ్లిపోతారన్నారు.