ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పబ్‌జీ’ ప్రేమ కథలో అనేక ఆనేక ఆసక్తికర విషయాలు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2023, 08:59 PM

‘పబ్‌జీ’లో పరిచయమైన వ్యక్తి కోసం.. పాకిస్థాన్ మహిళ తన నలుగురు పిల్లలతో భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. వీరిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు శనివారం వీరికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, అప్పటికే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తాజాగా వెల్లడయ్యింది. తననుతాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. మరోవైపు.. తన భార్యను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నాడు.


కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా, పాకిస్థాన్‌ సింధు ప్రావిన్సుల్లోని ఖైరాపూర్ జిల్లాకు చెందిన సీమా హైదర్‌ లకు పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం స్నేహంగా మారి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్‌ మీదుగా నేపాల్‌కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్‌లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.


అనంతరం అక్కడ నుంచి ఇరువురూ తమతమ దేశాలకు తిరిగి వచ్చేశారు. అయితే, ఆ రోజు తన ప్రయాణం చాలా కఠినంగా సాగిందని, ఎంతో భయపడ్డానని సీమా గుర్తుచేసుకుంది. అనంతరం.. తన పిల్లలతోసహా భారత్‌ రావడానికి ఆమె పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. నేపాల్‌ నుంచి పాకిస్థాన్ వెళ్లిన తర్వాత తన భర్తతో విభేదించి, తన పేరున ఉన్న ఓ ప్లాట్‌ను రూ.12 లక్షలకు అమ్మి డబ్బు సమకూర్చుకుంది. తనతో పాటు తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది.


మేలో దుబాయ్ మీదుగా నేపాల్ చేరుకుని అక్కడి పొఖారా నగరంలో కొంతకాలం గడిపింది. అక్కడి నుంచి ఖాట్మాండు.. ఆపై బస్సులో ఢిల్లీకి బయలుదేరి మే 13న గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అక్కడ సచిన్ అద్దె‌కు ఫ్లాట్ తీసుకుని, ఆమెను అక్కడ ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే పోలీసులు అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇరుగు పొరుగువారితో తనది ఢిల్లీ అని.. సచిన్‌తో తనకు పెళ్లి జరిగిందని అబద్దం చెప్పేది. అంతేకాదు, మాట్లాడేటప్పుడు ఉర్దూ పదాలు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునేది.


అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తాను అధికారికంగా భారత్‌లోనే ఉండిపోయేందుకు అధికారులను సంప్రదిస్తానని సీమా తెలిపారు. ‘వాస్తవానికి.. మమ్మల్ని నెలల తరబడి జైల్లో పెడతారని భావించా. కానీ, బెయిల్‌ వార్త వినగానే ఆనందంతో కేకలు వేశా. నా భర్త సచిన్‌ భారతీయుడు.. నేనూ భారతీయురాలిగానే భావిస్తున్నా’ అని ఓ వార్తాసంస్థతో తెలిపింది. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంది.


అంతేకాదు, తాను హిందువుగా మారి, తన పేరును సీమా సచిన్‌గా మార్చుకున్నట్టు ఆమె తెలిపారు. ‘హిందూ, ముస్లిం మతాల్లో సీమా పేరు కామన్.. కాబట్టి నా మొదటి పేరును సచిన మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.. నన్ను నేను సీమ లేదా సీమ సచిన్‌గా భావిస్తాను.. మా పిల్లల పేర్లను రాజ్, ప్రియాంక, పరి, మున్నీగా మార్చాం’ అని తెలిపింది.


సచిన్ మాట్లాడుతూ.. సీమతో కలిసి ఇంట్లో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ‘నా కుటుంబ సభ్యులు సీమను ఆమె పిల్లలతో అంగీకరించారు.. సీమకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీలను అభ్యర్థిస్తున్నాను.. హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని నిర్వహించాలని భావిస్తున్నాం’ అని చెప్పారు. ఈ ఏడాది మార్చి 13న ఖాట్మండులో వివాహం చేసుకున్నామని, అయితే దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు, సాక్ష్యాలు లేవని తెలిపారు.


మరోవైపు, సీమా భర్త గులామ్ హైదర్ మాత్రం.. ‘భర్త నుంచి విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇస్లాం లేదా హిందూయిజం అనుమతించదు.. నా భార్యను తిరిగి పాకిస్థాన్ పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని వేడుకున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa