ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయా జిల్లా కేంద్రాల వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున దీక్షకు దిగారు. తమ డిమాండ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు దీక్షలకు దిగారు. తెలంగాణలో కంటే రాష్ట్రంలో అదనంగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు విజయవాడ ధర్నాచౌక్ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు 36 గంటల మహాధర్నా చేపట్టారు. అలాగే, ప్రకాశం జిల్లా ఒంగోలులో సైతం వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించడం మానేసి.. దీక్షలో పాల్గొంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు.
ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలను, బిల్లులను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతోందని, వేతనాలు పెంచాలని కోరారు. గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కల్పించాలని కోరారు. జగన్ ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక దీక్షలు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, కడప తదితర జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా దీక్షలు కొనసాగుతున్నాయి.