విశాఖలో రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితులను బెదిరించి వారి నుంచి బలవంతంగా వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు సీఐస్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
విశాఖలో రూ.2వేల నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన సీఐ స్వర్ణలతకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది.. ఈ కేసులో ఆమెతో పాటుగా ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 వరకు ఈ ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.. దీంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతోపాటు స్వర్ణలతను బ్యారెక్‌లో ఉంచారు.
సీఐ స్వర్ణలత, ఎస్‌బీ-2లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారట. గతంలో గాజువాక, టూ టౌన్ పోలీసు స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై కూడా ఆరోపణలు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడికి సంబంధించి ఈ కేసు తెరపైకి వచ్చింది. నగరానికి చెందిన నేవీ రిటైర్డ్ ఉద్యోగులు శ్రీనివాస్, శ్రీధర్‌లకు ఆరిలోవకు చెందిన సూరిబాబుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రూ.2వేల నోట్లు మారుస్తానని ఇద్దరికి చెప్పాడు.. రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. కోటి విలువచేసే రూ.2వేల నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. ఇలా చేస్తే ఏకంగా రూ.10 లక్షలు వస్తాయని చెప్పాడు.. దీంతో వారిద్దరు కూడా ఆశపడ్డారు. ఈ ఇద్దరు రిటైర్డ్ నేవీ ఉద్యోగులు రూ.90 లక్షలు రెడీ చేసుకున్నారు.. ఆ వెంటనే సూరిబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ నోట్ల వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని.. హోంగార్డు శ్రీను, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్‌లకు సూరిబాబుకు తెలిపాడు. హోంగార్డు, సీఐ నోట్ల మార్పిడి విషయాన్ని సీఐ స్వర్ణలతకు చెప్పారు. ఈ డబ్బులు లెక్కల్లో ఉండవని భావించారు.. అప్పుడే వీరు తమ ప్లాన్ అమలు చేశారు.
ఈ నెల 3న సాయంత్రం డబ్బు తీసుకుని రావాలని.. శ్రీనివాస్ శ్రీధర్‌లకు సూరిబాబ్ ఫోన్ చేశాడు. వీరిద్దరు డబ్బులు తీసుకుని కారులో సీతమ్మధారలోని ఓ ఏరియాకు వచ్చారు.. సూరిబాబు డబ్బుల్ని పరిశీలించాడు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని హోంగార్డు శ్రీను, కానిస్టేబుల్ హేమసుందర్‌లకు తెలిపాడు. వెంటనే కానిస్టేబుల్, హోంగార్డుల్ని వెంటబెట్టుకుని సీఐ స్వర్ణలత పోలీస్ వాహనంలో ఈ ముగ్గురు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. శ్రీను, హేమసుందర్ తనిఖీల పేరుతో ఆ డబ్బులకు సరైన పత్రాలు లేవని బెదిరించారు. ఈ డబ్బుల్ని ఐటీ అధికారులకు అప్పగించాలని చెప్పడంతో వారు భయపడ్డారు. కారులో సీఐ స్వర్ణలత ఉన్నారని వెళ్లి మాట్లాడమని కానిస్టేబుల్ హేమసుందర్ చెప్పారు.. ఆమె కూడా డబ్బుకు ఎలాంటి పత్రాలు లేవని సీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత వాళ్లతో డీల్ మాట్లాడుకుని డబ్బులు వసూలు చేశారు.. 12 లక్షలు తీసుకున్నారు.
నేవీ రిటైర్డ్ ఉద్యోగులు ఆ డబ్బులకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు సేకరించారు. ఈ నెల 6న డీసీపీ 1 విద్యాసాగర్‌నాయుడికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే వసూళ్లపై విచారణ చేపట్టారు.. నిజమేనని తేలడంతో కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్ట్ చేసి డబ్బుల్ని రికవరీ చేశారు. అంతేకాదు స్వర్ణలతపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సూరిబాబును ఏ1గా, హోంగార్డు శ్రీను ఏ2, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్ ఏ3, ఆర్‌ఐ స్వర్ణలతను ఏ4గా చేర్చారు. అంతేకాదు సీఐ స్వర్ణలతకు సినిమాలంటే ఇష్టం.. ఆమె ఓ మూవీలో నటిస్తుండగా, ఆ పోస్టర్ వైరల్ అవుతోంది. అంతేకాదు సినిమాల కోసం ఓ కొరియోగ్రాఫర్‌ను కూడా నియమించుకుని డ్యాన్సులు చేశారు.. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.