తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డికి సంబంధించి పుట్లూరు మండలం కోమటికుంట్లలోని తోటలో చీనీ మొక్కలు నాటిన ఏడాదిన్నరకే రూ. 13.89 లక్షల పంటల బీమా పరిహారం అందిందని ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఆ డబ్బుల్ని రికవరీ చేయాలని కోరారు. ఏడాదిన్నర వయసున్న చీనీ మొక్కలకు పంటల బీమా ఎలా వస్తుందన్నారు.
అంతేకాదు తాడిపత్రి ఎమ్మె్ల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పైనా జేసీ మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’ అంటూ వెంకట్రామిరెడ్డిని ఉద్దేశేంచి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చెప్పులతో కొడుతారని.. వాళ్ల మాదిరిగా దోచుకోవడం తనకు చేత కాదన్నారు. ఇంట్లో నాటుసారా అమ్మి బతికేవాళ్లు.. కేసులు నమోదు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కొడుతావా.. కొట్టురా చూద్దాం అంటూ మండిపడ్డారు. ‘మీ చిన్నాన్న చేసిన బీమా అక్రమాల గురించి ఆధారాలు ఇస్తాను చెప్పుతో కొట్టు’ అంటూ మండిపడ్డారు. పోలీసులు లేకుంటే పెద్దారెడ్డి ఒక్క అడుగువేస్తారా.. వెంకట్రామిరెడ్డి తండ్రిని చంపిన వాళ్ళతో ఎందుకు రాజీ అయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 'మీ తాత, తండ్రి అంటే నాకు చాలా గౌరవం ఉంది.. వాళ్లతో కారులో కూడా తిరిగాను' అన్నారు.
ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం కూడా వాళ్లకు లేదన్నారు. చల్లా సుబ్బారాయుడు సహాయం చేయకపోతే వెంకట్రామిరెడ్డి తాత శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేదలకు దక్కాల్సిన పంటల బీమాను అక్రమంగా లక్షల రూపాయలు కొట్టేశారని చెప్పుతో కొట్టుపో అన్నారు. లండన్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసిన వెంకట్రామిరెడ్డి.. ఇక్కడ గొప్పలు చెబుతున్నారన్నారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి ఆయన బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు.