ఏపీలో జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందన్నారు మాజీ ఎంపీ చింతా మోహన్. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 20 సీట్లు కంటే ఎక్కువగా రావడం కూడా కష్టమే అన్నారు. రాష్ట్రంలో 25 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 15 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీలకు ఎక్కువ సీట్లు రావన్నారు. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలను రాష్ట్రంలో ఉన్న దళితులని శాసింబోతున్నారని వ్యాఖ్యానించారు. పేదవాళ్లకి న్యాయస్థానాల్లో న్యాయం జరగడం లేదని.. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందన్నారు.
పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలిగా ఉందని.. పవన్ కళ్యాణ్ యాత్ర థీమ్ లేకుండా రాజకీయాల్లోకి రావడం, సందేశం లేని సినిమాలా ఉందన్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న చనిపోయి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు ఎవరికీ శిక్ష పడలేదన్నారు. అందరికీ సమన్యాయం అందించాలని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడతారన్నారు.
కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశానికి రక్ష అన్నారు చింతా మోహన్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిన్న మాటకు రెండేళ్లు జైలు శిక్ష ఎలా వేస్తారని ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీకి ఇచ్చిన తీర్పు కూడా అంత ఆశజనకంగా లేదని.. చిన్న మాట అంటేనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. గ్యాస్, పెట్రోల్, నిత్యవసర ధరలు పెంచుకుంటూ ప్రధాని వెళ్తున్నారని.. దేశ ప్రధాని ఒక రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెప్పడం బాధాకరమన్నారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బీజేపీ సాధించినది శూన్యమని.. దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు అన్నీ కూడా ప్రధాని మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.