ఇప్పటి వరకు ఒక యాంకర్ చదువుతుంటే.. మనం వార్తలు ఎలా విన్నాం. కానీ ముందు ముందు ఈ పరిస్థితి మారనుంది. టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. మనుషులు చేసే పనులన్నీ మెషీన్లే చేస్తున్నాయి. ఒక మెషీన్ వార్తలు ఎలా చదువుతుందని ఆశ్చర్యపోతున్నారా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ అద్భుతం సాధ్యమైంది. అయితే ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ఏఐ యాంకర్లు.. ఉండగా అది ఇటీవలె మన దేశంలో కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. కేవలం జాతీయ ఛానెళ్లలోనే ఈ ఏఐ యాంకర్లు వార్తలు చదువుతుండగా.. తాజాగా లోకల్ ఛానెల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్.. వార్తలు చదువుతోంది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓటీవీ.. మీడియా రంగంలోనే వినూత్నంగా ఆలోచించింది. తొలిసారి లోకల్ ఛానెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ యాంకర్‌కు లిసా అనే పేరు పెట్టింది. ఈ అందమైన కృత్రిమ మహిళా యాంకర్.. ఒడియాలో చక్కగా వార్తలు చెబుతోంది. ఈ లిసా ఆవిష్కరణ కార్యక్రమం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు. టీవీ జర్నలిజంలో అడుగు పెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ఆర్టిఫిషియల్ న్యూస్ యాంకర్‌ను తీసుకువచ్చినట్లు ఓటీవీ మేనేజింగ్ డైరెక్టర్ జగి మంగత్ పండా వెల్లడించారు. ఇది ఒడిశాలోనే ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు.
ఈ ఏఐ యాంకర్ చాలా రకాల భాషలు మాట్లాడుతుందని ఓటీవీ మరో ఎండీ లితిషా మంగత్ పండా వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఇంగ్లిష్, ఒడియాలో మాత్రమే లిసా.. వార్తలు చదువుతోందని చెప్పారు. ఒడియా భాషలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని అని.. అయినా తాము పట్టుదలతో దీన్ని సాధించామని.. తెలిపారు. అయితే సాధారణ యాంకర్లు పలికేలా స్పష్టమైన ఉచ్ఛారణ లేకపోయినా.. గూగుల్ అసిస్టెంట్ కంటే చాలా బాగా వార్తలు చెబుతున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ప్రశ్నలు అడగడం.. వాటికి సమాధానాలు చెప్పేలా అభివృద్ధి చేస్తామని లితిషా మంగత్ పండా ధీమా వ్యక్తం చేశారు.
ఒడియా భాషలోని ఓటీవీ భువనేశ్వర్‌కు చెందిన టెలివిజన్ సంస్థ. దీన్ని 1997 లో భువనేశ్వర్, కటక్‌లలో ప్రారంభించారు. అనంతరం ఒడిశాలోని మొత్తం ప్రధాన పట్టణాలకు ఈ ఓటీవీని విస్తరించారు. ఒడిశాలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా ఓటీవీ కావడం గమనార్హం. దీన్ని జగి మంగత్ పండా మొదలు పెట్టారు. 2006 లో ఓటీవీ కేబుల్ ఛానెల్ నుంచి శాటిలైట్ ఛానెల్‌గా మార్పు చెందింది.