దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను కేజ్రీవాల్ సర్కార్.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజకీయంగా తీవ్ర పోరాటం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చివరకు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఖరి ఏంటో తెలపాలని అందులో ప్రశ్నించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తమ అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుందని.. ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్నికైన ప్రభుత్వం నుంచి విచక్షణ అధికారాల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి.. కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం సాగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల మీద అధికారాల నియంత్రణ విషయంలో కేంద్ర ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇటివల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా.. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరిని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. దీనితో పాటు ఈ పిటిషన్‌ను సవరించి.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంలో తదుపరి విచారణను సుప్రీం కోర్టు జులై 17 కు వాయిదా వేసింది.
ఢిల్లీలోని ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్లు, నియామకాలపై స్థానికంగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీకే అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మే 19 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనని ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కమిటీని నియమించింది. ఈ కమిటీలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లోబడే ఉంటుందని ఆర్డినెన్స్ తెచ్చింది. అయితే అప్పటి నుంచి ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ సర్కార్.. భారీ ఉద్యమం చేపట్టింది. తమ అధికారాలకు కత్తెర వేస్తూ.. వాటిని లాక్కునే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపిస్తోంది.
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై వచ్చే నియంత్రణ అధికారాలను కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ దూరం చేస్తుందని పిటిషన్‌లో ఆప్ సర్కార్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతోపాటు దానిపై మధ్యంతర స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది. ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అమలు కాకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ కూడగట్టారు. ఆయా రాష్ట్రాల్లో తిరిగి వివిధ పార్టీల అధినేతలను కలిసిన కేజ్రీవాల్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో అధికార బీజేపీకి తగిన బలం లేనందును ఢిల్లీ ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించాలని కేజ్రీవాల్ ప్లాన్ చేశారు.