పోలవరం ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలావుంటే ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పీపీఏ సభ్యులు హాజరయ్యారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయమై జలసంఘం లోతుగా చర్చించింది. డయాఫ్రం వాల్ నాలుగు ప్రదేశాల్లో దెబ్బతిన్నట్టు వచ్చిన నివేదికపై చర్చించింది. డయాఫ్రం వాల్ నిర్మాణ లోపాల బాధ్యత రాష్ట్రానిదేనని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ డిజైన్లలో లోపాలు ఉంటే మాత్రం జలసంఘమే బాధ్యత వహించాలని కేంద్రం పేర్కొంది.
డయాఫ్రం వాల్ పై ఈ ఏడాది ఆరంభంలో ఎన్ హెచ్ పీసీ నివేదిక ఇచ్చింది. డయాఫ్రం వాల్ ను 8 జాయింట్లుగా కొత్తగా నిర్మించాలని ఎన్ హెచ్ పీసీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదిక మేరకు నిర్మాణాలు చేపట్టేందుకు అధ్యయనం చేయాలని కేంద్రం నేటి సమావేశంలో సూచించింది. పోలవరం ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు వారం గడువు విధించింది. ఒకవేళ, చేపట్టలేని పనులేవైనా ఉంటే అందుకు తగిన సాంకేతిక కారణాలను చూపించాలని జలసంఘం పేర్కొంది. రాష్ట్రం ఇచ్చిన నివేదికపై జలసంఘం అధ్యయనం చేస్తుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర నివేదిక వచ్చిన వారం లోగా మరో నివేదిక ఇవ్వాలని కేంద్రం జలసంఘాన్ని ఆదేశించింది. ఇదిలావుంటే గైడ్ బండ్ విషయంలో ఇచ్చిన నివేదికపై మరికొంత సమాచారం కావాలని జలశక్తి శాఖ కోరింది. గైడ్ బండ్ పై పూర్తి నివేదిక వచ్చాకే తదుపరి నిర్ణయం ఉంటుందని అధికారులు చెప్పారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ పై మరో రెండు వారాల తర్వాత సమావేశం కావాలని నిర్ణయించారు.