ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల పొట్టగొట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఈ మేరకు ఏలూరులో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల పొట్ట కొట్టడం తన ఉద్దేశం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువ సంపదను కేవలం 5 వేల రూపాయిలకే కట్టిపడేస్తున్నారని తెలిపారు. యువత సామర్థ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచనా వేయలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు ఏలూరులో జనసేన నాయకులు, వీర మహిళలతో సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేవలం రూ. 5 వేలకే యువతను ఊడిగం చేయమంటున్నారని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు వచ్చేంత మొత్తం కూడా వాలంటీర్లకు రావడం లేదన్నారు. నిరుద్యోగం ఎంత పేట్రేగిపోతే డిగ్రీ చదివి కేవలం రూ. 5,000 కే పని చేస్తారని చెప్పారు. శ్రమ దోపిడీ చేసిన జగన్.. క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో మహిళలు అదృశ్యమవుతున్నారని తెలిపారు. మహిళల అదృశ్యంపై కేంద్ర నిఘా వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు.
వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వేరే కావచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ, ప్రజల సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. వాలంటీర్లు ఇదే పని చేస్తున్నారని మాత్రం తాను చెప్పనని చెప్పారు. వాలంటీర్లు కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారని.. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. ప్రజల విలువైన సమాచారాన్ని వారు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు.
వాలంటీర్లు ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి సమాచారం కలెక్టర్లు, ఎస్పీల వద్ద ఉండాలని పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఉండాలని.. వాలంటీర్ వ్యవస్థ పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజాధనం తీసుకొని వైసీపీ కోసం పని చేసే వారిపై దృష్టిపెట్టాలన్నారు. వాలంటీర్లకు అవసరానికి మించి సమాచారం ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇప్పుడే అదుపులో పెట్టాలని.. వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరంగా మారుతోందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.