ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర భారతాన్ని వణికిస్తోన్న వరుణుడు,,,ఢిల్లీలో 41 ఏళ్ల నాటి రికార్డు కనుమరుగు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 10:13 PM

సాధారణంగా దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రభావం చూపుతుంటాయి. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకుంది. దక్షిణాది రాష్ట్రాలు చినుకు జాడ కరువై కలవరపడుతుంటే.. ఉత్తర భారతంలో వరుణుడు జలవిలయం సృష్టిస్తున్నాడు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌ మొదలు లడఖ్ వరకు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు  దేశ రాజధాని ఢిల్లీ నిలువునా వణుకుతోంది. ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. జులై 8 ఉదయం 9 గంటల నుంచి జులై 9 ఉదయం గంటల వరకూ 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1982 జూలై తర్వాత ఆ స్థాయిలో ఢిల్లీ వర్షపాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, 36 గంటల్లో దాదాపు 260 మి.మీ. వర్షపాతం నమోదుకాగా.. జులై మొత్తం వర్షపాతం కంటే 32 శాతం అత్యధికం.


జులై నెల మొత్తం 195.8 మి.మీ. వర్షం కురియాల్సి ఉండగా ఒకటిన్నర రోజుల్లోనే అంతకు 30 శాతానికి మించి పడింది. 1982 తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు.ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో మరో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.


కాగా, 1958 జులై 21న ఢిల్లీలో 266.2 మి.మీ.వర్షపాతం నమోదయ్యింది. ఇదే ఇప్పటి వరకూ అత్యధికం. మరోవైపు, భారీ వర్షం కారణంగా పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, ఆసుపత్రి ప్రాంగణాలు నీట మునిగాయి, రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీవాసులకు ఈ వర్షం కంటిమీద కునుకులేకుండా చేసింది. పలు చోట్ల చెట్లు, ప్రహరీ గోడలు, ఇళ్లు కూలిపోయిన ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది వరకూ గాయపడ్డారు. ఇళ్లు కూలిపోయిన ఘటనలకు సంబంధించి 13 వరకూ తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగుర్ని తమ రెస్క్యూ సిబ్బంది రక్షించారని పేర్కొంది. చెట్టు కూలి ఆటో డ్రైవర్ మృతిచెందాడు.


ఢిల్లీ పక్కనే ఉన్న గురుగ్రామ్‌లో గత 24 గంటల్లో 145 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. చెరువులో మునిగి ఇద్దరు చనిపోయారు. గురుగ్రామ్‌లో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని అపార్ట్‌మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. రుతుపవనాల సీజన్ కోసం సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి ఏర్పాట్లు చేయలేదని తాజా వర్షాలతో తేటతెల్లమయ్యింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో దుకాణాలు, నివాసాల్లోకి వర్షం నీరు చేరింది. ఆదివారం సెలవు కావడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా లేకపోగా, పలు కీలక ప్రాంతాలు మోకాళ్లలోతు నీటిలో చిక్కుకున్నాయి.


మరోవైపు, భారీ వర్షాలకు యమునా నది పొంగి ప్రవహిస్తోంది. హరియాణా ప్రభుత్వం లక్ష క్యూసెక్కుల నీటిని ఈ నదిలోకి విడుదల చేయడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారానికి ఆ నీరు ఢిల్లీకి చేరి, నీటిమట్టం ప్రమాద స్థాయి (205.33 మీటర్లు)ని దాటేస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. దీంతో వివిధ విభాగాల అధికారుల్ని అప్రమత్తం చేసి 16 కంట్రోల్‌ రూంలు ఏర్పాటుచేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com