నాలుగంటే నాలుగు అడుగుల జాగాలో ఉన్న పూరిగుడిసె.. ఆ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ రాయవరం మండలంలో చోటుచేసుకుందీ విచిత్రం. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో ఓ పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, ఈ నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.3,31,951 లు రావడంతో రాజుబాబు కుటుంబం షాక్ అయింది. ఇంత చిన్న పూరి గుడిసెకు అంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు రావడమేంటని అధికారులను ఆశ్రయించారు.
విద్యుత్ శాఖ అధికారులు రాజుబాబు బిల్లును పరిశీలించి సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు చోటుచేసుకుందని తేల్చారు. అనంతరం బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చిందని రాజుబాబు కుటుంబానికి తెలిపారు. కాగా, ఎస్సీ రాయితీ ఉండడంతో రాజుబాబు బిల్లు చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు వివరించారు.