జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియదని అన్నారు. బహుశా చంద్రబాబు నుంచి పవన్ కు రిపోర్ట్ అందిందేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామని స్పష్టం చేశారు.
"వాలంటీర్లు ఏమైనా పాకిస్థాన్ వాళ్లా? ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించాం. స్థానికులనే వాలంటీర్ గా నియమించాం. వాలంటీర్ల నియామకంలో సామాజిక న్యాయం పాటించాం. ఇవేవీ తెలియకుండా పవన్ కల్యాణ్ ఒక అజ్ఞానవాసిలా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో 2 లక్షల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణే! పవన్ కల్యాణ్ కు తెలియని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర" అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.