ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు, అక్రమ మద్యం రవాణా మద్యం రవాణా చేసే గ్యాంగ్‌లు తెలివి మీరిపోతున్నారు. రోజుకో మార్గంలో సరుకును ఊరు దాటించేస్తున్నారు.. ఎవరికీ దొరక్కుండా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూడా అదే జరిగింది. ఎస్‌ఈబీ అధికారుల సోదాల్లో గుట్టు మొత్తం బయటపడింది.
మంగళగిరి ఎస్‌ఈబీ ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి అదనపు ఎస్పీ రాజకమల్‌కు అక్రమ మద్యంపై సమాచారం ఇవ్వగా.. ఆయన మదనపల్లె ఎస్‌ఈబీ టీమ్‌ను అలర్ట్ చేశారు. ఎస్‌ఐ సిబ్బందితో కలిసి నిమ్మనపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లె సమీపంలోని అక్కగార్లకుంట దగ్గర ఉన్న ఇటుకల బట్టీ దగ్గర తనిఖీలు నిర్వహించారు.ఈ సోదాల్లో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని సీజ్ చేశారు.. ఈ లిక్కర్ డంప్‌లో గోవా మద్యంతో పాటు మరికొన్ని ప్రీమియం బ్రాండ్లు ఉన్నాయి. ఎస్ఈబీ మొత్తం 1,800 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ లిక్కర్‌ను గోవా నుంచి మదనపల్లెకు తీసుకొచ్చిన మినీ లారీని సీజ్ చేశారు. అలాగే మదనపల్లె నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించేందుకు వినియోగించే బొలేరో వాహనాన్ని కూడా జప్తు చేశారు. ఈ గోవా మద్యం కేసులో నిమ్మనపల్లె మండలం చౌకువారిపల్లెకు చెందిన మల్లికార్జునరెడ్డి, వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన బాబాచారి, మదనపల్లె రూరల్ సీటీఎంకు చెందిన విజయ్‌కుమార్, తుకరపల్లెకు చెందిన షేక్ నజీరాబేగంలను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్ఈబీ పోలీసులు తెలిపారు. మద్యం బాటిళ్లు తీసుకొచ్చి ఇలా ఇటుక బట్టీల్లో డంప్ చేయడం చర్చనీయాంశమైంది.