ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ, వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు.అలానే ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 50,793 మందికి ప్రభుత్వం 1,366.48 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కాగా, 47,017 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదల ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు.