ఏపీలో వానలు కొనసాగుతున్నాయి.. మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతారణశాఖ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఈ నెల 16న ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ 17న లేదా 18న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని భావిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు.
నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మిగిలినచోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. మిగిలిన జిల్లాల్లో మోసర్తు నుంచి తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల, సీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 11 సెంటీమీటర్లు, కృష్ణ జిల్లా మాసులిపట్నంలో 9.7, అవనిగడ్డలో 8.3, బాపట్ల జిల్లా రేపల్లెలో 8, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 6.6, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 4.4, కాకినాడ జిల్లా తునిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా వర్షాలు జోరుగా పడుతున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే గురువారం సంగారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.