తిరుపతివాసులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. నగరంలో రూ.400 కోట్లతో 13 ఎకరాల్లో ఇంటర్ మోడల్ సెంట్రల్ బస్టేషన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేశామని తెలిపారు. గతేడాది ఆర్టీసీతో ఎంవోయూ జరిగిందని.. ఈ నెలలోనే టెండరు దశ పూర్తవుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టేషన్ నిర్మాణం కాబోతుందన్నారు. కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో తిరుపతి తారకరామా స్టేడియంలో గడ్కరీ శంకుస్థాపన చేశారు.
అలాగే రేణిగుంట నాయుడుపేట మధ్య రూ.2300కోట్లతో జరుగుతున్న 57 కి.మీ 6 లైన్ల జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది జనవరికల్లా పూర్తవుతాయని గడ్కరీ తెలిపారు. తిరుపతి జిల్లాలో దాదాపు రూ.17 వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు వచ్చే ఏడాదికి పూర్తవుతాయన్నారు. ఏపీలో 7 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు చేపట్టగా.. బెంగుళూరు- చెన్నై, కోలారు జిల్లా బేతమంగళం-చిత్తూరు జిల్లా గుడిపాల, చిత్తూరు-చెన్నయ్ సమీపంలోని తచ్చూరు మార్గాలు ముఖ్యమైనవి అన్నారు. ప్రస్తుతం బెంగళూరు- చెన్నై ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు ఉందని.. హైవే పూర్తయితే రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 8744 కి.మీ జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందన్నారు. ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రం.. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్ట్స్ ఒకటని.. ప్రభుత్వం మూడు మేజర్ పోర్ట్స్ అభివృద్ది చేస్తోందన్నారు. జాతీయ రహదారులు నిర్మాణం ద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.