ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా పేరు నమోదు కోసం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆయన దరఖాస్తుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంత ఊరైన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా పేరు నమోదు చేయాలని గతంలో చీఫ్ ఎలక్టోరల్ అధికారికి దరఖాస్తు చేశారు. అయితే తన దరఖాస్తునను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ 2021లో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. గురువారం పిటిషనర్ పేరును జాబితాలో చేర్చాలని ఆదేశించేందుకు నిరాకరిస్తూ.. పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఓటరుగా పేరు చేర్చాలని కోరుతూ తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆయన సమర్పించే దరఖాస్తును చట్టనిబంధనలను అనుసరించి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. తన సొంత గ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన హైదరాబాద్‌లోని తన ఓటును స్వాధీనం చేసిన సర్టిఫికెట్ తీసుకెళ్లి దుగ్గిరాల తహసీల్దారుకు దరఖాస్తు చేశారు. తనకు సొంత ఊరిలో ఓటు హక్కు కల్పించాలని కోరారు.. కానీ దుగ్గిరాలలో ఉండటం లేదని తన దరఖాస్తును తిరస్కరిస్తూ నోటీసు పంపారు.
తనకు ఊర్లో ఇల్లు, పొలం, ఇతర ఆస్తులు ఉన్నాయని.. తాను ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా, సొంత గ్రామానికి తరచూ వెళ్లి వస్తుంటానని అప్పట్లోనే నిమ్మగడ్డ రమేష్ అన్నారు. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుందని.. తన దరఖాస్తును తిరస్కరించడంతో కొంత నిరాశ పడ్డాను అన్నారు. తన దరఖాస్తును పునఃపరిశీలించాలని కలెక్టరును కోరాను అన్నారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఆయనకు కోర్టులో కాస్త ఊరట లభించింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వంతో విభేదాలు నడిచాయి.. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ అంశంపైనా వివాదం జరిగింది. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. ఆయన కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు. తన టర్మ్ వరకు పదవిలో కొనసాగాారు.