రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అసైన్డ్ భూములపై సర్వ హక్కులను ఆ భూమిని అనుభవిస్తున్న రైతుకు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ తీసుకోలేని సాహసోపేత నిర్ణయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం భూమి కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయితే ఆ రైతుకు ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తూ సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీని వల్ల ఆ నిరుపేద కుటుంబాల సామాజిక స్థితిగతులు మారుతాయని చెప్పారు. కొంతమంది అవగాహన లోపంతో అమ్ముకోవడానికి హక్కు అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.