జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు టీడీపీ స్పందించలేదు.. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు. తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవస్థను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. అయితే ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ప్రెస్‌నోట్ వైరల్ అవుతోంది. ఆ నోట్‌లో పవన్ వ్యాఖ్యల్ని అచ్చెన్న ఖండించినట్లు.. జనసేనతో పొత్తును కూడా నిరాకరించినట్లు ప్రస్తావించారు. అలాగే జనసేన, వైసీపీ లోకేష్ పాదయాత్రపై కుట్ర అంటూ ఆరోపణలు చేసినట్లు నోట్‌లో పేర్కొన్నారు.
ఈ ప్రెస్‌నోట్ వైరల్ కావడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘నేరుగా ఢీ కొనలేక, ఓటమి పాలవుతున్నారన్న సత్యాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి పడుతున్న పాట్లు ఇవి. ఇలాంటి ఫేక్ వార్తలను ఇలాగే తన పేటీఎం బ్యాచ్ తో రోజూ చేయిస్తూ ఉంటే, జగన్ రెడ్డికి మానసిక రుగ్మత ఉన్నది అని జనం అనుకునేది అక్షరాలా నిజమే అని భావించాల్సి వస్తుంది. ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కో జగన్.. ఇలాంటి నక్క జిత్తులు, ముసుగు వేషాలు ఎందుకు?’అంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు.
'ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తెలియజేయునది ఏమనగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టడం, నేడు సచివాలయ వ్యవస్థను తప్పుపట్టడం వెనుక తెలుగుదేశం హస్తం ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇది పూర్తిగా అవాస్తవం.. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని చూస్తుంటే అతను మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జనసేనతో పొత్తుకు నిరాకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. జనసేన పార్టీ అధ్యక్షుడితో పాటు అతని పిచ్చి సైన్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తున్నది. రాజకీయాలు హుందాగా ఉండాలి కానీ విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకూడదు. అలాగే వారాహి యాత్ర వల్ల తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రచారం లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీ కలిసి లోకేష్ గారి పాదయాత్రను అణగొదొక్కాలనే కుట్ర చేస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కనుక జనసేనకు, తెలుగు దేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయడమైనది' అంటూ లేఖలో ప్రస్తావించారు.
ఈ ప్రెస్‌నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీడీపీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ నోట్ అని.. ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఫేక్ నోట్ నిజం అనుకునే ప్రమాద ఉండటంతో అచ్చెన్నాయుడు స్పందించారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో కొందరు ఫేక్ ప్రెస్‌నోట్‌లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.