మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆయన కింది కోర్టులకు అప్పీలు చేయగా.. తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల గుజరాత్ హైకోర్టును కూడా రాహుల్ గాంధీ ఆశ్రయించగా.. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే తమ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతారు. దీంతో వెంటనే రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని.. తద్వారా లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అనర్హులు అవుతారు.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ అనే పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చి 23 వ తేదీన సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజే అనగా మార్చి 24 వ తేదీన రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 లోని సెక్షన్ 8 ప్రకారం రాహుల్ గాంధీపై వేటు వేసినట్లు లోక్‌సభ సెక్రటరీ వెల్లడించారు. దీంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ వెంటనే అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో.. ఢిల్లీలోని ప్రభుత్వ భవనాన్ని వదిలిపెట్టి ఆయన మరో ఇంటికి మారారు.
అయితే ఇప్పటికే ఇదే కేసులో పరువు నష్టం కేసు వేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ వేసే పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేసే ముందు తన వాదనలను వినాలని కోరారు. రాహుల్‌కు దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు ఈ నెల 7న తీర్పు ఇచ్చింది.