ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదారు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై ఆమె విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సంస్థాగత కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని.. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
2014 తర్వాత బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఐదారు నెలల సమయం మాత్రమే ఉందని.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పరిపాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు.
ఇక, మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో అత్యాచారం జరిగినా ఇప్పటికీ న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని, ఒక ఉపాధ్యాయుడిని పట్ట పగలే చంపేస్తోన్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ నొక్కితే చాలు పోలీసులు వచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారని.. కానీ, అలా జరుగుతోందా అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదన్నారు.
ఇక, గ్రామ, వార్డు వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారని.. కానీ, వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారని పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదని.. వచ్చిన పరిశ్రమలు కూడా ఉండటం లేదని దుయ్యబట్టారు. లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని చెప్పారు. ఇక, రాష్ట్రంలో ఇసుక దందా పెద్ద ఎత్తున జరుగుతోందని పురందేశ్వరి అన్నారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందని.. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని విమర్శించారు. ఇసుక మాఫియా వల్ల పేద ప్రజల జీవితాలు రోడ్డున పడ్డారని.. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకోవడమే కాదు.. పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని రాష్ట్ర బీజేపీ నేతలకు పురందేశ్వరి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa