ఆన్‌లైన్ యాప్స్ బెట్టింగ్ వల్ల అమాయకులు బలైపోతున్నారని, వీటిని వెంటనే నిషేధించాలని అఖిల భారత యువజన సమాఖ్య నగర కన్వీనరు ఎస్‌కే మైనుద్దీన్ డిమాండ్ చేశారు. ఆదివారం కడప జిల్లా రారా గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆన్‌లైన్ యాప్స్ వల్ల యువత ఎంతో నష్టపోతున్నారన్నారు. క్రికెట్, రమ్మీ ఇతర ఆటలకు బానిసై నిరంతరం పనీపాట, తిండీ తిప్పలు లేకుండా వాటితోనే గడుపుతున్నారన్నారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్స్ నిర్వాహకులు వీరిని లోబర్చుకుని డబ్బు ఆశ చూపుతున్నారని, డబ్బు తిరిగి కట్టకుంటే వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఈ విధంగా కొన్ని ముఠాలు సైబర్ నేరాలకు పాల్పడుతూ లింకులు కూడా పంపిస్తున్నారన్నారు. ఈ లింకులను నొక్కితే వెంటనే తమ అకౌంట్లలోని డబ్బు మాయం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు.