అసభ్యకరంగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదు అంటూ చెప్పులు చూపిస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్ర హెచ్చరికచేశారు. ఈ మేరకు సోమవారం టీడీపీ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితే ఇకపై ఉపేక్షించబోమని తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత సహా మహిళా నేతలు చెప్పులు చూపిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారికి తీవ్ర హెచ్చరికలు చేశారు.
సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాని వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలను కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.
అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ.. తనతో సహా పలువురు మహిళలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని.. సీఎం జగన్ చెప్పినట్లుగానే వారు పనిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆత్మాభిమానం దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసభ్యకర పోస్టులు పెట్టిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. అరాచక ప్రభుత్వంపై పోరాటంలో మహిళా సంఘాలు కలిసి రావాలని అనిత కోరారు.