విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ.. దేశంలోని అతి పురాతన విద్యా సంస్థల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. ఈ నెల 19తో ఈ కళాశాల ఏకంగా వందేళ్లను పూర్తి చేసుకుంది. 1923లో 32 మంది విద్యార్థులతో ప్రారంభమై.. ఇప్పటివరకు 20 వేల మంది వరకు డాక్టర్లను ప్రపంచానికి అందించింది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివిన ఎంతోమంది దేశ, విదేశాల్లో ప్రముఖ వైద్యులుగా పేరు సంపాదించారు. ఈ కాలేజీలో చదివి దేశంలోని అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డుల్ని అందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.
తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ప్రారంభించాలని విజ్ఞప్తిపై అప్పటి మద్రాస్ ప్రభుత్వం విశాఖకు వైద్య కళాశాలను మంజూరుచేసింది. 1923 జులై 19న కళాశాల 32 సీట్లతో ప్రారంభమైంది.. మొదట్లో మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా నడిచిన ఈ వైద్య కళాశాల.. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైన తరువాత దానికి అనుబంధంగా మారింది. 1940లో ఏయూ వైస్ చాన్సలర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ సీఆర్ రెడ్డి గతంలో వైజాగపట్నం మెడికల్ కాలేజీ పేరును ఆంధ్ర మెడికల్ కళాశాలగా మార్చారు. 1986 వరకు ఏయూకు అనుబంధంగా కొనసాగగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్లు 250 ఉన్నాయి. పీజీ సీట్లు 363, సూపర్ స్పెషాలిటీ సీట్లు 48, కాలేజీలో ఉన్న డిపార్ట్‌మెంట్లు 34, ఏఎంసీ పరిధిలోని బోధనాస్పత్రులు 6 కాగా అధ్యాపకులు 350మంది ఉన్నారు. తొలి ప్రిన్సిపాల్‌గా కల్నల్ ఎఫ్‌జే అండర్సన్ పని చేయగా.. ప్రస్తుతం డాక్టర్ జి.బుచ్చిరాజు 71వ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు.
అంతేకాదు ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదవిన విద్యార్థులు రాజకీయ, సేవా, కళా రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఎంతో మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాజకీయాల్లో ఉన్నారు. అనకాపల్లి ఎంపీగా ఉన్న సత్యవతి, మంత్రి సీదిరి అప్పలరాజు ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులే. అంతేకాదు గతంలోనూ అనేక మంది మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. అంతేకాదు ఇక్కడ చదువుకున్నవారిలో సుమారు 1500 నుంచి 2వేల మంది వైద్యులు అమెరికాలో స్థిరపడ్డారు.
అలాగే పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ప్రస్తుతం అక్కడ చదువుతున్న వైద్య విద్యార్థులంతా కలిసి శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆంధ్ర వైద్య కళాశాల ప్రారంభించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరంతా కలిసి రూ.45 కోట్లతో ఓ భవనాన్ని నిర్మించి మెడికల్ కాలేజీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెప్టెంబరుకు ఈ భవన నిర్మాణం పూర్తవుతుందట.. నవంబరు 3న ఈ భవనాన్ని వైద్యకళాశాలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని నిర్ణయించారట. 1.2 ఎకరాల్లో నిర్మించే ఈ భవనంలో స్టూడెంట్ సెంటర్, లెక్చర్ హాల్, లెబ్రరీ, రీడింగ్ రూం, రీక్రియేషన్ రూం, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏఎంసీ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తాము చదువుకున్న కాలేజీకి ఏదో ఒకటి చేయాలనే తపనతో వందేళ్ల సందర్భంగా ఈ భవనాన్ని నిర్మించి, కళాశాలకు అందిస్తున్నారు. ఈ భవనం మెయింటెనెన్స్ ఖర్చులను పూర్వ విద్యార్థుల సంఘమే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.