ఏపీ సర్కార్ తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైకో రెడ్డి అనే విషయాన్ని తాను ముందు నుంచీ చెపుతూనే ఉన్నానని ఆయన అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని... కానీ, పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకురావడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే పట్టసీమ మోటార్లను ఆన్ చేయడం లేదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతోనే పట్టిసీమను చంద్రబాబు కట్టించారని చెప్పారు. పోలవరంను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసే అవకాశమే లేదని అన్నారు.
జులై 20వ తేదీ వచ్చినా కాలువలకు మరమ్మతులు చేయించలేదని... చాలా చోట్ల రైతులే చందాలు వేసుకుని మరమ్మతులు చేయించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉందని... పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా దిగజారడం గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.