ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర ప్రభావం చూపుతోన్న వాతావరణ మార్పు,,,జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు

international |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:19 PM

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో వాతావరణ మార్పు మానవాళికి పెను ముప్పుగా పరిణమించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల, శిలాజ ఇంధనాల దహనం, అడవుల నిర్మూలన, పారిశ్రామికీకరణ, వ్యవసాయ విధానాలు వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల చేరడానికి దోహదం చేస్తున్నాయి. తత్ఫలితంగా గత శతాబ్దం నుంచి భూగోళం సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది.


వాతావరణ మార్పులు ప్రపంచంపై ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన ఇది. ఇరాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణ సూచిక పై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్టు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్‌ మెక్‌‌కార్తి వెల్లడించారు. ఇరాన్‌ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హీట్ ఇండెక్స్ 66.7 డిగ్రీల సెల్సియస్‌‌గా నమోదయినట్టు ట్విట్టర్‌లో తెలిపారు. ఇది మనుషులు, జంతువులు భరించలేని తాపమని చెప్పారు.


వాతావరణం ఎంత వేడిగా ఉంది.. ఎంత చల్లగా ఉందనే విషయాన్ని అంచనా వేయడానికి వాతావరణ నిపుణులు గాలిలో ఉష్ణోగ్రత, ఇతర కారకాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ పద్ధతుల్లో ముఖ్యమైంది హీట్ ఇండెక్స్. గాలిలో ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేడిని అంచనా వేస్తారు. పర్షియన్‌ గల్ఫ్‌లోని వెచ్చని జలాలపై ప్రవహించే తేమతో కూడిన గాలి.. లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో ఇరాన్‌లో భయంకర ఉష్ణోగ్రత నమోదయ్యింది.


మెక్‌కార్తీ పేర్కొన్న సమయానికి పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. సాపేక్ష ఆర్ద్రత 65 శాతంతో కలిపి 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇటువంటి వేడి పరిస్థితులు మానవులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. తగినంత నీరు తీసుకోకపోతే చెమట, మూత్రం రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళ్లి డీహైడ్రేషన్‌కు గురి కావాల్సి వస్తుందని అంతర్జాతీయ టీకా, ఇమ్యునైజేషన్ కూటమి (గవి) హెచ్చరించింది. రక్తం చిక్కబడి, గడ్డకట్టే స్థాయికి చేరుకుంటుందని.. దాంతో గుండెపోటు, పక్షవాతం వంటివి రావొచ్చని పేర్కొంది. అప్పటికే అనారోగ్య సమస్యలున్నవారికి, వృద్ధులకు ఈ వాతావరణం మరింత ప్రమాకరమని తెలిపింది.


బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్లోరిడాలో అట్లాంటిక్‌ మహాసముద్ర జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. చైనాలోని శాన్‌బో టౌన్‌షిప్‌లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


ఈ నేపథ్యంలో తక్షణమే భూతాపాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోతే అది మానవులకు ఓ నరకంగా మారే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వాతావరణ విభాగం చీఫ్ డాక్టర్ అక్షయ్ డియోరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే తరుచూ తీవ్రమైన వాతావరణ సంఘటనలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa