ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ రఘురామ కీలక వ్యాక్యలు,,,,అయినా ఆయనంటే గౌరవం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 09:33 PM

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎవరి కుట్రలోనూ భాగస్వామి కావొద్దన్నారు రఘురామకృష్ణ రాజు. ప్రస్తుతం ఆయన అంటే గౌరవం లేకపోయినా.. కోపం మాత్రం లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై, వాయిదా పడిన తర్వాత సెంట్రల్ హాల్లో సహచర ఎంపీలకు తాను తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు.


'నా కుటుంబ సభ్యుల అపహరణను నాటకమని అంటావా?, నా భార్య గురించి మాట్లాడుతావా??, నిన్ను లేపించి వేస్తాను' అంటూ నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారని రఘురామ చెప్పుకొచ్చారు. గతంలోనూ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే తనను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. ఆ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకు వెళ్లానని.. అయినా గోరంట్ల మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తెలియకపోయినప్పటికీ.. తాను ఈ సంఘటనను వివరిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను అపహరించడం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. డబ్బుల కోసం జరిగిన కిడ్నాప్ కాదని.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెల 17న లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.


తాను రాసిన లేఖ అందినట్లుగా అదే నెల 26న ప్రధాని స్వయంగా సంతకం చేస్తూ లేఖ రాశారన్నారు. ఏదో డబ్బుల కోసమే జరిగిన కిడ్నాప్ అయితే విశాఖపట్నం నివాసయోగ్యం కాదని.. తానిక్కడ ఇక వ్యాపారాలు చేయదలుచుకోలేదని సత్యనారాయణ మీడియా ముందు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అంటే కిడ్నాప్ అనేది వ్యాపార లావాదేవీలకు సంబంధించి జరిగినట్టు ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పినట్లుయిందని అన్నారు. కిడ్నాప్ వ్యవహారంలో చెప్పుకోలేని బాధను ఏదో ఆయన అనుభవిస్తున్నారని.. తనకు పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశానని అన్నారు.ఎంపీ మంచి కోసం తాను కృషి చేస్తే.. తనను అసభ్య పదజాలంతో దూషించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన చెబుతున్నట్లుగా.. తాను ఆయన భార్య గురించి మాట్లాడింది లేదన్నారు. అయినా కూడా బండ బూతులు తిడుతూ.. చంపిస్తాను.. లేపేస్తాను.. ఎవడు అడ్డం వస్తాడో చూస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సంఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న తమ పార్టీ ఎంపీలు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. సత్యనారాయణ నోరు పారేసుకున్నంతసేపు వేడుక చూసి, ఆ తరువాత ఆయన్ని అక్కడ నుంచి తీసుకువెళ్లారని అన్నారు. ఆ సమయంలో తనతో పాటు సెంట్రల్ హాల్లో ఉన్న శివసేన ఎంపీలు సత్యనారాయణను అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారని తెలిపారు. తాను కూడా ఆయన మాదిరిగానే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నోరు పారేసుకోవచ్చునని.. కానీ తాను ఒక పార్లమెంటు సభ్యుడిగా హుందాగా వ్యవహరించానని అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నోరు అదుపులో పెట్టుకుంటే ఆయనకు గౌరవం ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa