ఆగస్ట్‌లో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మంత్రి బొత్సను కలిసి నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో తప్పుదొర్లిన ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించాలని కోరారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీసు విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ కేటగిరీల్లో వయోపరిమితిని ఏపీపీఎస్సీ, డీఎస్సీ అభ్యర్థులకు 47 ఏళ్లకు, కానిస్టేబుల్‌కు 27 ఏళ్లకు, ఎస్‌ఐ అభ్యర్థులకు 30 ఏళ్లకు, ఫైర్, జైలు వార్డెన్స్ అభ్యర్థులకు 32 ఏళ్లకు పెంచాలని కోరారు. హోంగార్డులకు జనరల్ అభ్యర్థులతో కాకుండా ప్రత్యేకంగా రాత పరీక్ష పెట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.