‘‘చేనేతను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా ఐదో ఏడాది వైయస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే వెంకటగిరి నేల నుంచి అమలు చేస్తున్నాం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్‌లుగా మారుస్తామని చెప్పిన నా మాట ప్రకారం ఈ నాలుగేళ్లలో ప్రతి అడుగులోనూ, ప్రతి అక్షరంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అడుగులు వేస్తూ వచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వరుసగా ఐదో ఏడాది వైయస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున రూ.194 కోట్లను జమ చేశారు. నేడు అమలు జరిగిన నేతన్న నేస్తం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు అందించినట్టయింది. నేతన్న నేస్తం పథకానికి ఇప్పటి వరకు రూ.970 కోట్లు ఖర్చు చేశామని, నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 3,706 కోట్లు ఖర్చుచేసిందని సీఎం వైయస్ జగన్ చెప్పారు.