వైఎస్ వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైఎస్ వివేకా హత్యకు రాజకీయాలే కారణమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారనే విషయం బయటపడటం సంచలనంగా మారింది. ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో 8వ నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పేర్కొనడం, ఆగస్టు 14న విచారణకు రావాలని ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య కేసులోని తాజా పరిణామాలపై వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసులో వెనుక ఎవరు ఉన్నారనే వాస్తవాలను న్యాయస్ధానాలు నిగ్గు తేలుస్తాయని, ఎవరెన్ని ఆరోపణలు చేసినా న్యాయస్ధానాలపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. గూగుల్ టేకవుట్ మొదటి నుండి ఎందుకు లేదని, మధ్యలో సీబీఐ ఎందుకు బయటకు తీసుకొచ్చిందని ప్రశ్నించారు. న్యాయస్ధానాలను పక్కదారి పట్టించేలా గతంలో సీబీఐ వ్యవహరించిందని, గతంలో తాము ఆధారాలతో సహ కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు.
చంద్రబాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే నమ్మకం లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఒక్కరొచ్చినా.. ఇద్దరొచ్చినా.. రామోజీరావవుతో కలిసి వచ్చినా ప్రజల మద్దతు తమ నాయకుడు జగన్‌కే ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రతిపక్షాలు ఎలా వచ్చినా తాము సిద్దమన్నారు. కొన్ని పత్రికలకు, మీడియా ఛానెళ్ళకు వ్యక్తిగతంగా జగన్‌పై దాడి చేయడం ఆనవాయితీగా మారిపోయిందని ఆరోపించారు.