రుతుస్రావం అనేది మహిళలో జరిగే సాధారణ ప్రక్రియ. అయితే దీనిపై చాలా మందిలో అనేక అపోహలు, మూఢనమ్మకాలు, అనవసరమైన భయాలు వ్యాప్తిలో ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో గదిలో బంధించడం, చప్పగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం.. మిగితా కుటుంబ సభ్యుల కంటే భిన్నంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. దురదృష్టవశాత్తూ రుతుస్రావం చాలా అశుద్ధమైందిగా భావిస్తారు. మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలకు రుతుస్రావం సమయంలో అనుమతించరు. ఇలాంటి మూఢ నమ్మకాలకు భిన్నంగా ఉత్తరాఖండ్‌కు చెందిన జితేంద్ర భట్ అనే వ్యక్తి.. తన కుమార్తె ప్రథమ రజస్వలను వేడుకగా జరిపించి సమాజానికి ఓ సందేశం ఇచ్చారు.
డెహ్రాడూన్ సమీపంలోని కాశీపూర్‌లో జితేంద్ర భట్, తన భార్య, కుమార్తెతో ఉంటున్నారు. ఇటీవల, తమ కుమార్తెకు రుతుక్రమం మొదలైనట్టు గుర్తించిన ఆ దంపతులు.. ఈ అంశం గురించి బయటకు చెప్పడానికి సిగ్గుపడలేదు. తల్లితండ్రులిద్దరూ తమ కుమార్తెను కూర్చోబెట్టి.. రుతుక్రమం గురించి సమగ్రంగా వివరించారు. కుమార్తె సందేహాలు, అపోహలను తొలగించారు. రుతుక్రమం అనేది మహిళల జీవితంలో సహజమైన, సాధారణ ప్రక్రియ అని, దానిని అపవిత్రంగా లేదా నిషిద్ధంగా పరిగణించరాదని తెలియజేశారు.
అనంతరం బంధువులు, స్నేహితులను పిలిచి ఘనంగా వేడుకను నిర్వహించారు. తమ కుమార్తె ప్రథమ రజస్వలైన క్షణాన్ని భట్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా.. ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ పార్టీ ఏర్పాటుచేసిన జిత్రేంద్ర భట్.. బంధువులు, సన్నిహితులను ఆహ్వానించారు. కుమార్తె జీవితంలో కొత్త దశ ప్రారంభానికి ప్రతీకగా కేక్ కట్ చేశారు. కేవలం తమ కుమార్తెకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా రుతుక్రమం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఇది ఒక అవకాశంగా మారింది. దీని ద్వారా సహజ ప్రక్రియపై వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని అందించారు.
ఇక, పీరియడ్స్‌లో వచ్చే రక్తం అశుద్ధమైందని.. దీని కారణంగా మొటిమల వస్తాయని కొందరు అపోహ పడతారు. కానీ, రుతుచక్రం సమయంలో మహిళల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయి. పీరియడ్స్ ప్రారంభానికి ముందు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి. సేబాషియస్ గ్రంధులు ఎక్కువ శ్వేధాన్ని స్రవిస్తాయి. ఈ జిడ్డు పదార్థం గ్రంధుల స్రావాన్ని అడ్డుకోవడంతో బ్రేక్‌లకు కారణమవుతుంది. దీంతో మెటిమలు వస్తాయి. అంతేకానీ అపరిశుభ్రం వల్ల కాదు. రుతుచక్రం మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రుతుక్రమం గతి తప్పితే ఆ మహిళకు ఏవో అనారోగ్య సమస్యలతో ఉన్నట్టు అర్థం. బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా అంతర్గతంగా ఏదో సమస్య ఉందని సూచన.