పల్నాడు జిల్లాలో పురాతన దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. అచ్చంపేటలోని అంబడిపూడి వద్ద కృష్ణానదిలో బయటపడిన పురాతన విగ్రహాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు స్నేహితులు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారి కాలికి ఈ విగ్రహాలు తగిలాయట. నీళ్లల్లో నడుస్తూ వెళ్తున్న సమయంలో కాలికి తగలడంతో ఉలిక్కిపడిన ఆ ఇద్దరు యువకులు ఏముందా అని ఆసక్తిగా గమనిస్తే.. విగ్రహాలు బయటపడ్డాయి. శివలింగం, విష్ణుమూర్తి, నంది ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించారు ఆ యువకులు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. అందరూ కలిసి వాటిని ఒడ్డుకు చేర్చారు. వీటిని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.
మరోవైపు ఈ విగ్రహాలు కృష్ణానది ఎగువభాగం నుంచి కొట్టుకువచ్చాయా అనే కోణంలో గ్రామస్థులు ఆలోచిస్తున్నారు. ఇదే క్రమంలో... ఇసుక తవ్వకాల కారణంగా నది అడుగుభాగాన ఉన్న పురాతన విగ్రహాలు ఇలా బయటపడ్డాయా అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. ఈ విగ్రహాల విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి విగ్రహాలను పరిశీలించారు. అనంతరం పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పురాతత్వశాఖ అధికారుల పరిశీలనలోనైనా ఈ పురాతన విగ్రహాల వివరాలు తెలియాలని స్థానికులు కోరుకుంటున్నారు.
గత నెలలో కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణా నది ఒడ్డున కుప్పలుగా నాగదేవత విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాలను రాతితో చేశారు.. 50 వరకు ప్రతిమలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. కొన్ని విగ్రహాలు దెబ్బతిని ఉన్నాయి.. దీంతో ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ప్రకారం.. ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని చర్చించుకున్నారు. ఎవరో వ్యక్తులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కుప్పగా పోశారనే ప్రచారం జరిగింది. గతంలో కూడా పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ దగ్గర ఇలాగే నాగదేవత ప్రతిమలు ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ కృష్ణా నదిలోనే విగ్రహాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.