ఏపీలో జగన్ సర్కార్ అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గత నెల 28న పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకానికి సంబంధించి డబ్బుల్ని బటన్ నొక్కి అకౌంట్‌లలో జమ చేశారు. అయితే అమ్మఒడి రూ.15వేలు అయితే.. రూ.9 వేల అకౌంట్‌లలో జమ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెంటనే స్పందించింది.. దీనిపై క్లారిటీ ఇచ్చింది.
‘అమ్మ ఒడి రూ.9 వేలేనా?’, ‘సాయంలో కోతపెట్టడంతో విస్తుపోతున్న లబ్ధిదారులు’ అంటూ ప్రచారం జరుగుతోందని.. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పిల్లలను చదివిస్తున్న పేదల కుటుంబాలకు ఆసరాగా మారిన అమ్మ ఒడి పథకాన్ని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతోనే ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి పథకం కింద నూటికి నూరుశాతం పిల్లల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వరుసగా నాలుగో ఏడాది అమ్మ ఒడి పథకాన్ని ఈ ఏడాది జూన్ 28న ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేశారన్నారు. నాలుగో ఏడాది ఈ పథకం కింద ప్రభుత్వం రూ.6,392.94 కోట్లను విడుదల చేసిందని.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తల్లులు అందరికీ కూడా వారి వారి ఖాతాల్లో అమ్మ ఒడి డబ్బు జమ అయ్యిందని క్లారిటీ ఇచ్చారు. తద్వారా ఇంటర్ వరకూ చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు మేలు జరిగిందన్నారు.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఎక్కడా పొరపాట్లు లేకుండా, అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం అమలు చేశారన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులు అందరికీ అమ్మ ఒడి డబ్బును జమ చేశారన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని.. జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు కింది పట్టికలో పొందుపరిచారు.
అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తోంది ప్రభుత్వం. ఈ డబ్బుల్ని నేరుగా తల్లుల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేస్తారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల హాజరు 75 శాతం కచ్చితంగా ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకానికి అర్హులు. ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి.. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కూల్ ఐడీ కార్డు సమర్పించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అనర్హులు.