పోలవరం ప్రాజెక్టు తొలి దశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ. 12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వకంగా జవాబు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు రూ. 10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం గత జూన్ 5వ తేదీన తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు.
ఇక, పోలవరం తొలి దశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.17,144 కోట్లు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్ 5వ తేదీన తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 2022 మార్చి 15న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణమే రూ. 10,000 కోట్లు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2022 జూలై 15న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం రూ. 12,911 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.