దేశ ఆర్ధిక రాజధాని ముంబయి చాలా ఖరీదైన నగరమని చాలా మంది భావిస్తారు. అయితే, ఆటో ఛార్జీల విషయంలో మాత్రం ముంబయిలో చాలా తక్కువే. అయితే, గార్డెన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరులో ఆటో ఛార్జీలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త వ్యక్తులు ఆటో ఎక్కితే ఇక అంతే సంగతి.. ఎక్కడెక్కడో తిప్పి.. నాలుగైదు రెట్లు వసూలు చేస్తారు. తాజాగా ముంబయికి చెందిన ఓ కంపెనీ సీఈఓకి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. కేవలం 500 మీటర్ల దూరానికే ఆటోవాలా రూ.100 తీసుకోవడంతో ఆయన షాకయ్యారు. ఈ అనుభవాన్ని ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.
ముంబయికు చెందిన న్యూరల్‌గ్యారేజ్ అనే సంస్థ సీఈఓ మందార్ నటేకర్.. ఇటీవల బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ చోటుకు వెళ్లడానికి ఆటో ఎక్కిన ఆయనకు చేదు అనుభవం ఎదురయ్యింది. 500 మీటర్ల దూరానికి ఆటో డ్రైవర్ రూ.100 వసూలు చేశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పంచుకుంటూ..
‘ఈ ఫొటోలో ఉన్న మెషీన్‌ను బెంగళూరులో కేవలం ఓ అలంకారప్రాయమైన వస్తువుగానే చూస్తారు.. ఇది చాలా ఖరీదైనది. అందుకే దాన్ని ఆటోడ్రైవర్‌లు ఆన్ చెయ్యరు.. సాధారణంగా ముంబయిలో అయితే అర కిలోమీటరకు రూ.9 తీసుకుంటారు. 9 కిలోమీటర్ల ఆటోలో ప్రయాణిస్తే రూ.100 చెల్లిస్తాం.. కానీ, బెంగళూరులో మాత్రం 500 మీటర్లకే రూ. 100 ఛార్జి ఇవ్వాల్సి వచ్చింది’ అని ఆయన వాపోయారు.
ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘కేవలం బెంగళూరులోనే కాదు.. ముంబయి వెలుపల ప్రతి నగరంలో ఇదే పరిస్థితి.. చెన్నైలోనూ ఆటో రైడ్ చాలా ఖరీదైంది.. ఈ అనుభవం నాక్కూడా ఎదురైంది’ అంటూ టీవీఎఫ్ సంస్థ ఛైర్మన్ విజయ్ కోషీ రిప్లై ఇచ్చారు. దీనికి నటేకర్ స్పందిస్తూ ‘ఇది చాలా విడ్డూరం.. ఈ హైవే దోపిడీని అరికట్టాలి.. ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఈ దోపిడీని నిలువరించడం సాధ్యపడటం లేదు’ అని అన్నారు.
మరో నెటిజన్ ‘భారతదేశంలో ఆటోరిక్షాలు మీటర్‌పై సరిగ్గా పనిచేసే ఏకైక నగరం ముంబై.. మిగతా దేశ మంతా ఇలాంటి దోపిడీయే ఉంది’ అని పేర్కొన్నాడు. ఇక,ఆటోవాలాల దోపిడీని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వ గతేడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి రెండు కిలోమీటర్ల వరకూ కనీస ధరను రూ.30గా నిర్ణయించి, అక్కడి నుంచి ప్రతి కిలోమీటరుకు రూ.15 చొప్పున ఛార్జి చేయాలని ఆదేశించింది.