బీపీ, షుగర్ వంటి అసాంక్రమిక వ్యాధులపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులకి సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఎన్‌సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) సర్వేలో భాగంగా మొత్తం జనాభాలో ఏకంగా 82.47 శాతం మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌సీడీ బాధితులకు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చికిత్స కూడా అందిస్తున్నామని వివరించారు. తాజాగా మరోసారి సర్వే చేపట్టాలని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జిల్లాల నోడల్ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓపీలతోపాటు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జె.నివాస్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు.