ప్రముఖ పుణ్యక్షేతం శ్రీశైలంలో భక్తుల కోసం సరికొత్తగా యాప్‌ను తీసుకొచ్చారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా స్వామి వారి స్పర్శ దర్శనం, ఆర్జిత సేవ టికెట్లను సులభంగా పొందేందుకు యాప్‌ను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. అలాగే నంది గుడి సర్కిల్ దగ్గర సీఆర్వో ఆఫీస్‌ను ప్రారంభించారు మంత్రి. అలాగే సీఆర్వో ఆఫీస్‌లో నంది దేవస్థానం ప్రచురణల విక్రయ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు కొట్టు సత్యనారాయణ.
మరోవైపు శ్రీశైలం దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఆర్జితసేవా టిక్కెట్లు, స్వామి వారి స్పర్శ దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల నుంచి ఆర్జితసేవలు, స్వామి వారి స్పర్శదర్శనం టిక్కెట్లను దేవస్ధానం వెబ్‌సైట్ W.W.W. Srishaila Devasthanam. Org లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందొచ్చు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు తమ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్షేత్ర పరిధిలోని ప్రధాన కూడళ్లు, సత్రాల వద్ద ఆన్‌లైన్ విధానం, సేవలకు సంబంధించిన వివరాలు తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేశారు.
మరోవైపు శ్రీశైలంలో బ్యాటరీ వాహనాలు వచ్చేశాయి. దివ్యాంగులు శ్రీశైలం దేవస్థానానికి వస్తే వారు బస్టాండ్ దగ్గర, శ్రీశైలం దేవస్థానం దగ్గరలో దిగితే వారిని ఈ బ్యాటరీ వాహనంలో ఎక్కించుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత మళ్లీ ఆ బ్యాటరీ వాహనంలో ఎక్కించుకొని శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతనమైన ఆలయాల దగ్గరకు తీసుకెళతారు. మళ్లీ వారిని తీసుకొచ్చి బస్టాండ్, వారు వచ్చిన వాహనాల దగ్గర దింపేస్తారు.