ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పిల్స్‌ ‌దాఖలు,,,కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2023, 02:47 PM

బిగ్‌బాస్‌ రియాల్టీ షో విషయంలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ చేయకపోతే ఎలాగని నిర్వహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది. ఇప్పుడు ఈ షో ప్రసారం కావడం లేదన్న కారణంతో కోర్టు కళ్లు మూసుకుని ఉండలేదంది ధర్మాసనం.


బిగ్‌బాస్‌ షో అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండు పిల్స్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సెన్సార్‌ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ షోను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలని కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో ప్రసారం కావడం లేదని ప్రతివాది తరఫు లాయర్ వాదించారు. ఈ పిల్స్‌పై విచారణ సరికాదని.. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్‌ వేయడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు.


బిగ్‌బాస్‌ షో ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ విధానం లేదన్నారు ప్రతివాది తరఫు లాయర్. ప్రసారం అయ్యాక అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చని.. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు వ్యవస్థ ఉందన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్‌షిప్‌ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని కోర్టు ముందు ప్రస్తావించారు. బిగ్‌బాస్‌ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్‌ మార్చుకోవచ్చని.. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకునే పరిధి తక్కువ అన్నారు.


అభ్యంతర ప్రసారాల విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ షోకు ముందే సెన్సార్‌షిప్‌ లేకపోతే ఎలా.. ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు. ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనం ఉందంటున్నారు. ఒకవేళ ప్రతీ ఛానల్‌ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా అని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన యంత్రాంగం లేకపోతే ఎలా.. నైతిక విలువలను కాపాడకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని.. హైకోర్టుకు ఉన్న విచారణాధికార పరిధికి అనుగుణంగా బిగ్‌బాస్‌ షో ప్రసారానికి ముందే సెన్సార్‌ చేసే వ్యవహారంపై కేంద్రానికి తగిన సూచనలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం అభిప్రాయపడింది.


కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తామని.. ఇక్కడ పిల్లి మెడలో గంట కట్టేదెవరనేది ప్రధానం అని వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌‌ఋతో పాటూ సంబంధిత ఛానల్, బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌, సినీ హీరో అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com