ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద దేశంలోనే అతి తక్కువ గృహ నిర్మాణాలను చేపట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 1,80,715 ఇళ్ళు మంజూరయితే.. కేవలం 2,167 ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 1,80,000 ఆర్థిక సహాయాన్ని చేస్తుందని, అయినా దేశంలోనే అతి తక్కువ ఇళ్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే అద్వాన పరిస్థితుల్లో ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్రం ఉందన్నారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆర్ 5 జోన్ లో 50,790 ఇండ్ల నిర్మాణాన్ని మాత్రం ఆగమేఘాల మీద చేపడతామని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి పరిధిలోని ఇళ్లను శరవేగంగా నిర్మిస్తే, ఇళ్ళ స్థలాల లబ్ధిదారులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 'రాష్ట్రంలో ఇళ్ళు మీరు కట్టుకుంటారా?, మమ్మల్ని కట్టించమంటారా?? అని ప్రభుత్వ పెద్దలు లబ్ధిదారులను ప్రశ్నించారని, ప్రభుత్వమే తమకు ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా, ఇళ్ళ నిర్మాణాన్ని చేయించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటారా?, ఇంటి స్థలం పట్టాను క్యాన్సిల్ చేయమంటారా??' అని బెదిరిస్తున్నారని అన్నారు.
రాజధాని ప్రాంతంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం ద్వారా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నారా లోకేష్‌ను ఓడించాలని కుట్ర చేస్తున్నారన్నారు. పద్మ వ్యూహంలో అభిమన్యుడిని ఒంటరి చేసి ఓడించినట్లుగా లోకేష్‌ను ఓడించాలని అనుకుంటున్నారని.. కానీ పద్మవ్యూహం కుట్రలను లోకేష్ చేదించగలరన్నారు.
గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి తమ పార్టీ పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు దోహదపడిన రెండు సంఘటనల్లో ఒకటి కోడి కత్తి కేసు, రెండో వైఎస్ వివేకానందరెడ్డి హత్య అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించలేదని.. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రుణం ఎలా మంజూరు చేశారని రఘురామ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపర భగీరధుడిలా మొదలు పెట్టానని చెప్పిన జగన్.. కేంద్రం అనుమతుల కోసం అవసరమైన పత్రాలను మాత్రం సమర్పించలేదన్నారు.
జల్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రతి ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సంసిద్ధతను వ్యక్తం చేసిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి షెకావత్ స్వయంగా తనతోనే చెప్పారన్నారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను మంజూరు చేస్తే.. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ అమలు ద్వారా సర్వనాశనం చేశారని.. వెలిగొండ ప్రాజెక్టుకు మోక్షం లభించేది ఎప్పుడో అన్నారు. గృహ నిర్మాణ రంగంలో, సాగు, తాగు నీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు.