ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మైకు మొరాయించడంతో కొంత అంతరాయం ఏర్పడింది. 10 సెకెన్ల పాటు మైకు పనిచేయకపోవడంతో సీఎం అసహనానికి గురయ్యారు. దీంతో కారణాలపై ఆరా తీయడానికి పోలీసులు కేసు నమోదుచేయడం రాజకీయ దుమారం రేగుతోంది. ఎఫ్ఐఆర్‌లో ఎవర్నీ నిందితులుగా చేర్చకపోయినా.. సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఇది అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీయగా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే? ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సంస్మరణ సభను తిరువనంతపురంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ప్రతిపక్షం కార్యక్రమమైనా వారి ఆహ్వానాన్ని సీఎం స్వీకరించి.. హాజరయ్యారు. ఈ సమయంలో ఆ సమయంలో సీఎం విజయన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే పెద్ద శబ్దంతో మైకు మొరాయించింది. దీంతో సీఎం ఒకింత అసహనానికి గురయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఊమెన్ చాందీని కీర్తిస్తూ స్లోగన్స్ చేయడం ఇబ్బంది పడ్డారు. వారు నినాదాలు ఆగిపోయే వరకూ ప్రసంగాన్ని ప్రారంభించలేదు.
ఈ వ్యవహారాన్ని పోలీసులు సుమోటాగా స్వీకరించి.. మర్నాడు కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యకు గల కారణాలను పరిశీలించేందుకే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తిరువనంతపురం నగర డీసీపీ అజిత్ వివరించారు. ప్రముఖలు పాల్గొనే కార్యక్రమాల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులుగా ఎవర్నీ చేర్చలేదన్నారు. కానీ, దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. మైక్ మొరాయిస్తే కేసు పెట్టడం ఏంటని విస్తుపోతున్నారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని కేరళ పీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్ మండిపడ్డారు. ఇక, సీఎంఓ ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదుచేశారని శాసనసభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశ్ ఆరోపించారు. ఇదే ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ మాములుగా లేవు. ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి.
అయితే, సీఎంను ఊమెన్ చాందీ సంస్మరణ సభకు ఆహ్వానించడంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. చీటింగ్ కేసుల్లో నిందితురాలైన మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ ప్రారంభించి విజయన్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం చాందీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.