రాష్ట్ర విద్యుత్ బోర్డును విడదీసి ట్రాన్స్ కో, జెన్కో, డిస్కమ్‌లుగా విభజించినప్పుడు.. వేతన సవరణతో సహా ఇతర డిమాండ్ల సాధన కోసం 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేశారు. ఆ తర్వాత డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేయాలన్న ఆలోచన వారికి రాలేదు. అదే తరహాలో నేడు వేతన సవరణ సహా 12 డిమాండ్లతో గురువారం నుంచి దశలవారీ ఆందోళనను ప్రారంభించారు. గురువారం భోజన విరామ సమయంలో చేపట్టిన నిరసన ప్రదర్శనను శుక్రవారం కూడా కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలకు ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వీరి బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. చర్చలు తేలేంతదాకా నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని జేఏసీ నిర్ణయించింది. యాజమాన్యం దిగిరాకుంటే ఆగస్టు పదో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించారు.