విజయనగరం జిల్లా, కంటకాపల్లి గ్రామానికి చెందిన ఉల్లి నాగరాజు(40) బుధవారం సాయంత్రం సమీపంలోనున్న కొత్తూరు గ్రామానికి వెళ్లి కిరణా సామాన్లు తెస్తానని భార్య లక్ష్మికి చెప్పివెళ్లాడు. కిరణా సామాన్లు కోసం వెళ్లిన వ్యక్తి ఎంతకు రాకపోవడంతో అదేరోజు రాత్రి కుటుంబీకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికారు. కనిపించకపోవడంతో గురువారం కూడా వెదికారు. ఈక్రమంలో గురువారం కంటకాపల్లి గ్రామ సమీపంలో గని చెరువు దగ్గర నాగరాజు చెప్పులు, గొడుగు కనిపించాయి. గ్రామస్థులు చెరువులో వెదికినా నాగరాజు కనిపించ లేదు. శుక్రవారం ఉదయం లక్ష్మి తండ్రి చెరువు దగ్గరకు వెళ్లి చూడగా నాగరాజు మృతదేహం చెరువులో తేలియాడడాన్ని గుర్తించారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోటకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడు బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హేమంత్‌కుమార్ తెలిపారు.