ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాజ్యసభలో కేంద్ర విద్యుత్ మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ చెల్లించాల్సిన సుమారు రూ. 6వేల కోట్ల బకాయిలను రిజర్వ్ బ్యాంక్ ద్వారా జమ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఒక రాష్ట్రం... మరో రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలను రిజర్వ్ బ్యాంకు ద్వారా జమ చేయించవచ్చు అని న్యాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అభిప్రాయంలో చెప్పిందని కేంద్ర మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై... కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజ్యసభలో మంత్రి ఆర్‌కే సింగ్ చెప్పారు. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని గత ఏడాది తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.