నల్లమల అడవిలో గుంపులు గుంపులుగా జనం. సీరియస్‌గా ఏదో వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? ఇటీవల కురిసిన వర్షాల అనంతరం వాగులో వజ్రాలు కొట్టుకొస్తున్నాయట. ఆ ప్రవాహంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి వస్తున్నారు. రోజంతా జల్లెడ పడుతున్నారు. రోజంతా కష్టపడితే కొందరిని అదృష్టం వరిస్తోంది. మరి కొందరికి నిరాశే మిగులుతోంది. అసలు వజ్రాలు దొరుకుతాయని ఏమిటీ నమ్మకం? ఎవరికైనా దొరికాయా? నల్లమలలో ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఆ వివరాలు..
నంద్యాల - గిద్దలూరు రహదారికి సమీపంలోని గాజులపల్లి గ్రామ సమీపంలో సర్వనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయానికి కూత వేటు దూరం నుంచే ఓ వాగు ప్రవహిస్తోంది. వానాకాలంలో ఈ వాగులో వజ్రాలు దొరుకుతాయని స్థానికులు, చుట్టుపక్కల వారి నమ్మకం. అందువల్ల దీన్ని ‘వజ్రాల వాగు’ అని పిలుస్తారు. వర్షాలు కురిసి, వాగులో ప్రవాహం మొదలుకాగానే.. ఇక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. డైమండ్స్ కోసం ఎక్కడెక్కడ నుంచో జనం తరలివచ్చి గాలిస్తుంటారు.
కొన్ని రోజుల కిందట ఈ వాగులో ఒక వ్యక్తికి ఓ వజ్రం దొరికిందట. మార్కెట్‌లో అది రూ. 4 లక్షలు పలికినట్లు సమాచారం. ఈ విషయం గుప్పుమనడంతో ఇక్కడ వజ్రాల వేట మొదలైంది. వజ్రాల వాగులో అన్వేషణ కోసం వచ్చే వారి సంఖ్య ఈసారి మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. కుబంబాలకు కుటుంబాలు తరలివచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. ఇలా అందరూ ఉన్నారు.
నంద్యాల జిల్లాతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. వజ్రాలు కాకపోయినా ఉంగరాల్లో పొదిగే రంగు రాళ్లు, ఆకర్షణీయమైన రంగుల్లో వివిధ ఆకృతుల రాళ్లు దొరుకుతున్నాయి. నాణ్యతను బట్టి మార్కెట్‌లో అవి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు పలుకుతున్నాయట.
ఏటా వర్షాకాలం మొదలవగానే ఇక్కడకు వచ్చి వజ్రాల వేట సాతిస్తామని గిద్దలూరుకు చెందిన ఆటో డ్రైవర్ సామెల్ తెలిపాడు. మూడు నెలల పాటు ఇక్కడ ఈ అన్వేషన కొనసాగుతుందని అతడు చెప్పాడు. ‘ఇప్పటివరకు కొంత మందికి వజ్రాలు దొరికాయి. మాకూ కొన్ని దొరికాయి. వాటికి రూ. 4 లక్షలు అడిగాం. కొంత మంది చోటా వ్యాపారులు కమిషన్ తీసుకొని విక్రయిస్తామని చెప్పారు. పరీక్షించిన అనంతరం వజ్రాలను తీసుకుంటామని చెప్పారు’ అని సామెల్ తెలిపాడు. మంచి వజ్రం దొరికితే తమ బతుకులు బాగుపడతాయనే ఆశ తప్ప మరో ఆశ లేదని అతడు చెప్పాడు.
ఒక్క వజ్రమైనా దొరక్కపోదా అని పదేళ్లుగా వజ్రాల వేట సాగిస్తున్నానని నరసమ్మ అనే వృద్ధురాలు తెలిపారు. ‘నరసింహ స్వామి మీద భారం వేసి కొన్నేళ్లుగా వజ్రాల వేట సాగిస్తున్నా. ఎప్పుడో కొన్నేళ్ల కిందట చిన్న వజ్రం దొరికింది. దానికి 3 వేల రూపాయలు ఇచ్చారు. పెద్ద వజ్రం ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో వెతుకుతున్నా’ అని నరసమ్మ అన్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితాలే మారిపోతాయి అనే ఆశతో ఈ వాగును జల్లెడ పడుతున్నవారు వందల్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa