న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గత వారం అరెస్టయిన రచయిత బద్రి శేషాద్రికి తమిళనాడు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురించి వ్యాఖ్యలు చేసినందుకు శేషాద్రిని జూలై 29 న అరెస్టు చేశారు. పెరంబలూరు జిల్లాకు చెందిన న్యాయవాది కవియరసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్టు చేసి ఆగస్టు 11 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. న్యాయవ్యవస్థపై శేషాద్రి అభిప్రాయాలు తనను కలవరపెడుతున్నాయని కవియరసు ఆరోపించారు. తిరుచ్చిలోని శ్రీరంగం పోలీస్ స్టేషన్‌లో రోజూ 15 రోజులపాటు హాజరుకావాలనే షరతుతో మంగళవారం శేషాద్రికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడిని తమ కస్టడీకి తీసుకోవాలని పెరంబలూరు పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో శేషాద్రిని తిరిగి తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక విడుదల కానున్నారు.