ఆంధ్రప్రదేశ్ అప్పు గురించి ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైయస్ జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదనే దుర్బుద్ధితో అప్పులపై రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు ఫిర్యాదులు, వినతులు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అప్పులపై ప్రతిపక్ష పార్టీల నేతల ప్రకటనలు, టీవీ డిబేట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఏపీ అప్పుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాన్ని కూడా జీర్ణించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి కోట్లను ఐదు సార్లు పత్రికల్లో రాసి దాన్ని రూ.5 వేల కోట్లుగా ప్రజలను నమ్మించాలనే తాపత్రయం క్లియర్‌గా కనిపిస్తుందన్నారు.