చిత్తూరు జిల్లావ్యాప్తంగా చోరీకి గురైన 200 సెల్‌ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వివరాల్లోకి వెళ్ళితే... సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న వారు ‘చాట్‌బాట్’ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ రికవరీ చేపట్టారు. దొంగతనానికి గురైన లేదా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడానికి క్రైమ్ సీఐ భాస్కర్, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, టెక్నికల్ అనాలసిస్ టీము సభ్యులు కలిసి పనిచేశారు. జిల్లాకు చెందిన ఫోన్లను రాష్ట్రంలోనే కాకుండా జమ్మూ, కశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బిహార్, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు ఎత్తుకెళ్లిపోయారు. అలాంటి వారిని మొబైల్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు గుర్తించి, ఇదాదాపుగా రూ.45 లక్షల విలువ చేసే 200 ఫోన్లను రికవరీ చేశారు. చాట్‌బాట్‌ను ప్రవేశ పెట్టాక ఇలా రెండో విడతలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొదటి విడతలో రూ.కోటి విలువ చేసే 500 ఫోన్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే.