వాతావరణ మార్పులు, భారీ వర్షాలు, నీళ్లు కలుషితం కావడం వల్ల తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు కండ్లకలక వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకే లక్షణం ఉండటం వల్ల కండ్లకలక వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వందల కేసులు నమోదవుతుండగా.. కంటి ఆస్పత్రుల్లో రోగుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీలోనూ కండ్లకలక వ్యాప్తి చెందుతుండటంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
స్కూళ్లల్లో ఒకరికి కండ్లకలక వస్తే మిగతా పిల్లలకు కూడా సులువుగా సోకే ప్రమాదముంటుంది. స్కూల్‌లోని విద్యార్థులందరికీ సోకే అవకాశం ఉంటుంది. పిల్లలకు అవగాహన లేకపోవడం వల్ల కండ్లకలక వచ్చినా తెలియపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకోలేరు. దీంతో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కండ్లకలక లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? అనే దానిపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.
కళ్లునొప్పిగా ఉండటం, దురద రావడం, వాపు ఏర్పడటం, కళ్లు ఏర్రగా మారి నీరు రావడం, నిద్ర లేచిన తర్వాత కళ్లు అతుక్కుపోవడం లాంటివి కండ్ల కలక లక్షణాలు అని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈలాంటి లక్షణాలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము వచ్చే అవకాశముందని తెలిపింది. కండ్లకలక వచ్చినప్పుడు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించింది. ఇతరులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచనలు చేసింది.
ఇక సొంత వైద్యం చేసుకోకూడదని, ఇతరులకు కరచాలనం ఇవ్వొద్దని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాడిన టవల్స్, కర్చీఫ్, చద్దర్లు ఇతరులకు ఇవ్వకూడదని, అలాగే లక్షణాలు ఉన్న పిల్లలను స్కూల్‌కి పంపిచవద్దని సూచించింది. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, వారికి అవగాహన కల్పించాలని తెలిపింది. కండ్లకలక బారిన పడిన పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కూల్‌కి పంపించవద్దని పేర్కొంది.